: నేనేం మాట్లాడతానో అని సీఎం వణికిపోతున్నారు: రేవంత్ రెడ్డి
తెలంగాణ శాసనసభలో ఏం మాట్లాడతానో, ప్రజలకు ఏ కొత్త విషయం చెబుతానో అని ముఖ్యమంత్రి కేసీఆర్ వణికిపోతున్నారని టీటీడీపీ నేత రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, తనకు భయపడే, సీఎం తనపై దుష్ప్రచారం చేయిస్తున్నారని అన్నారు. ఉద్యమ నాయకుడినని చెప్పుకునే ఆయనకు ఇలాంటి పనులు తగునా? అని రేవంత్ ప్రశ్నించారు. టీఆర్ఎస్ తమవిగా చెప్పుకునే టీవీ, పేపర్లకు పెట్టుబడులు ఎక్కడి నుంచి వచ్చాయో ప్రకటించాలని డిమాండ్ చేశారు. విద్యుత్ ప్రాజెక్టులు, సిమెంట్ కంపెనీల లోపలి వ్యవహారాలను తాను చెప్పగలనని హెచ్చరించారు. టీఆర్ఎస్ నేతలకు చెందిన పలు కంపెనీల్లో ఆంధ్రావారి పెట్టుబడులు లేవా? అని ఆయన నిలదీశారు. "డీఎల్ఎఫ్ కు సంబంధించి మీరే ఏకపాత్రాభినయం చేస్తే ఎలా? ప్రతిపక్షాలు మాట్లాడేందుకు అవకాశం ఇవ్వరా?" అని మండిపడ్డారు. కేసీఆర్ కు ఆపరేషన్ బ్లూ స్టార్ అంటే ఏమిటో తెలుసా? అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి అధికారాలను కేసీఆర్ దుర్వినియోగం చేస్తున్నారని రేవంత్ దుయ్యబట్టారు.