: ఉద్యోగాల పేరిట ఘరానా మోసం... రూ.8 కోట్లతో ఉడాయించిన మోసగాడు
సాఫ్ట్ వేర్ ఉద్యోగాల పేరిట ఓ మోసగాడు నిరుద్యోగుల నుంచి భారీగా దండుకుని పరారయ్యాడు. ఈ ఘటనపై అనంతపురం జిల్లా హిందూపూర్ లో కేసు నమోదైంది. సాఫ్ట్ వేర్ ఉద్యోగాలిప్పిస్తానని చెప్పిన అంజాద్ అనే వ్యక్తి అనంతపురం జిల్లాకు చెందిన నిరుద్యోగులను బుట్టలో వేసుకున్నాడు. బెంగళూరు నగరంలోని పలు కంపెనీల్లో ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, వాటిలో మిమ్మల్ని నియమిస్తానని చెప్పిన అంజాద్, భారీ ఎత్తున డబ్బులు వసూలు చేశాడు. చాకచక్యంతో వ్యవహరించిన అంజాద్, నిరుద్యోగులకు ఏమాత్రం అనుమానం రాకుండా దాదాపు రూ.8 కోట్లను వసూలు చేశాడు. వసూలు చేసుకున్న డబ్బుతో అంజాద్ ఉడాయించాడు. అంజాద్ జాడ తెలియని నేపథ్యంలో బాధితులు హిందూపూర్ పోలీసులను ఆశ్రయించారు. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు అంజాద్ కోసం గాలింపు మొదలుపెట్టారు.