: పార్టీ కార్యకలాపాల్లో జయలలిత బిజీ!
దాదాపు రెండు నెలల తరువాత ఏఐఏడీఎంకే అధినేత్రి జయలలిత పార్టీ పనుల్లో నిమగ్నమయ్యారు. 2016 అసెంబ్లీ ఎన్నికలకు పార్టీని ఇప్పటినుంచే పునరుద్ధరించి, బలోపేతం చేసేందుకు చర్యలు చేపట్టనున్నారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో దోషిగా నిర్ధారణవడం, దాంతో శిక్షపడి జైలుకు వెళ్లడం, మళ్లీ బయటకు రావడం... ఈ క్రమంలో ఎమ్మెల్యేగా అర్హత కోల్పోవడం, భవిష్యత్ ఎన్నికల్లో పొటీచేసే అవకాశం లేకపోవడం జరిగాయి. దాంతో, పార్టీలో తన స్థానాన్ని పటిష్ఠపరుచుకుని, అన్నాడీఎంకే అధినేత్రిగా చక్రం తిప్పనున్నారు. ఈ నేపథ్యంలో పార్టీకి సంబంధించిన పన్నెండు నగరపాలక సంస్థల్లో పార్టీ యంత్రాంగాన్ని పునర్వ్యవస్థీకరించనున్నారు. కొన్ని జిల్లాలోనూ కేంద్ర స్థాయిలో ఇలాంటి పునర్నిర్మాణాన్ని చేపట్టనున్నారట. తొలి దశలో భాగంగా, తిరువన్నామలై, విల్లుపురం, ధర్మపురి, తంజావూరు వంటి జిల్లాల్లో రెండుగా విభజించిన యూనియన్లను ఎన్నుకుని పునరుద్ధరణ పనులు చేపట్టాలనుకుంటున్నారని సమాచారం. 2008 నుంచి తమ పార్టీ అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎలాంటి పునురుద్ధరణ జరగలేదని అన్నాడీఎంకే సీనియర్ ఒకరు అంటున్నారు. కానీ, ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పార్టీ పునఃవ్యవస్థీకరణ చేపట్టాలని తమ అధినేత్రి నిర్ణయించారని సంతోషంగా చెబుతున్నారు.