: అంతరిక్షంలో అలజడి రేపుతున్న రష్యా శాటిలైట్ కిల్లర్!
పాశ్చాత్య దేశాల స్పేస్ ఏజెన్సీలు ఇటీవల అంతరిక్షంలో పరిభ్రమిస్తున్న ఓ మిస్టరీ వస్తువును కనుగొన్నాయి. ఆ వస్తువు ఓ శాటిలైట్ అని, ఇతర దేశాల శాటిలైట్లను నాశనం చేయడానికి దీన్ని రష్యా ప్రయోగించి ఉంటుందని 'ఫైనాన్షియల్ టైమ్స్' పత్రిక పేర్కొంది. ఆ శాటిలైట్ కిల్లర్ కు ఆబ్జెక్ట్ 2014-28ఈ అని నామకరణం చేశారు. అంతరిక్ష శకలాలను సేకరించేందుకు రష్యా మిలిటరీ దీన్ని ప్రయోగించినట్టు భావిస్తున్నా, రష్యా దీని ప్రయోగంపై నిర్దిష్ట ప్రకటన చేయకపోవడం అనుమానాలకు తావిస్తోందని 'ఫైనాన్షియల్ టైమ్స్' పేర్కొంది. పాట్రీషియా లూయిస్ అనే స్పేస్ సెక్యూరిటీ ఎక్స్ పర్ట్ దీనిపై స్పందిస్తూ, ఇది ప్రయోగాత్మక శాటిలైట్ గానే కనిపిస్తోందని అన్నారు. కాగా, గత మే నెలలో రష్యా ఓ రాకెట్ ప్రయోగించింది. దాని ద్వారా మూడు శాటిలైట్లను కక్ష్యలో ప్రవేశపెట్టారు. అయితే, ఈ మిస్టరీ శాటిలైట్ ప్రయోగం వివరాలు మాత్రం ఎక్కడా వెల్లడికాలేదు. ప్రస్తుతం ఈ శాటిలైట్ కిల్లర్ గమనాన్ని అమెరికా మిలిటరీ తన నార్త్ అమెరికన్ ఏరోస్పేస్ డిఫెన్స్ కమాండ్ (ఎన్ఓఆర్ఏడీ) ద్వారా నిశితంగా పరిశీలిస్తోంది. 1960 ప్రాంతంలో రష్యా ఇస్త్రెబిటెల్ స్పుత్నిక్ పేరిట ఓ ఫైటర్ శాటిలైట్ ప్రాజెక్టును తెరపైకి తెచ్చింది. అయితే, ఆ ప్రాజెక్టు నిలిచిపోయింది. ప్రస్తుతం రష్యా స్పేస్ ఏజెన్సీ అధిపతిగా వ్యవహరిస్తున్న ఒలెగ్ ఒస్తాపెంకో 2010లో మాట్లాడుతూ, పోరాట ఉపగ్రహాలను రష్యా మరలా రూపొందిస్తున్నదని తెలిపారు. అప్పట్లో ఆయన రష్యా స్పేస్ ఫోర్స్ కమాండర్ గా వ్యవహరించారు.