: మా హయాంలోనే ఇస్లాం మరింత వృద్ధి చెందుతుంది: కాశ్మీర్ బీజేపీ ఉపాధ్యక్షుడు
బీజేపీకి ఓటేసి అధికారమిస్తే, ఇస్లాం మరింత వృద్ధి సాధిస్తుందని ఆ పార్టీ జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర శాఖ ఉపాధ్యక్షుడు రమేశ్ అరోరా ప్రకటించారు. అంతేకాక ప్రజాభీష్టం మేరకు ఆర్టికల్ 370ని రద్దు చేసే దిశగానూ చర్యలు చేపడతామని ఆయన బుధవారం నాటి విలేకరుల సమావేశంలో వెల్లడించారు. అయితే ఈ విషయంలో తాము ప్రజల అభిప్రాయానికి విలువిస్తామని చెప్పారు. బీజేపీకి ఓటేస్తే, రాష్ట్రంలో తమకు మరింత భద్రత లభిస్తుందన్న కాశ్మీరీల అభిప్రాయంపై విలేకరుల ప్రశ్నలకు స్పందించిన ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు. "బీజేపీ మతతత్వ పార్టీ అనే భావన సరికాదు. కాశ్మీర్ అనేది సున్నీ సాధువుల నేల. మా హయాంలో రాష్ట్రంలో ఇస్లాం మెరుగైన వృద్ధి సాధిస్తుంది. బీజేపీ అన్ని మతాలను గౌరవిస్తుంది. కాశ్మీరీ సంస్కృతికి బీజేపీ ప్రమాదకరమన్న భావనలోనూ వాస్తవం లేదు. అలా ప్రచారం చేసే వారే అత్యంత ప్రమాదకారులు" అని ఆయన అన్నారు. ప్రస్తుత ఎన్నికల్లో తమ పార్టీ 44 సీట్ల మార్కును దాటుతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.