: కులాంతర వివాహం చేసుకుందని కూతుర్ని కడతేర్చారు!
కులాంతర వివాహం చేసుకుందన్న కోపంతో కన్న కూతురినే హతమార్చిన విషాద సంఘటన దక్షిణ ఢిల్లీలో జరిగింది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం వెంకటేశ్వరా కాలేజీలో చదువుతున్న విద్యార్థిని భావనా యాదవ్ (21) ప్రభుత్వ ఉద్యోగి అభిషేక్ సేథ్ (24)ను ప్రేమించి ఈనెల 12న ఆర్యసమాజ్ లో పెళ్లి చేసుకుంది. ఈ పెళ్ళితో తమ పరువు పోయిందని భావించిన భావన తల్లిదండ్రులు జగ్మోహన్ యాదవ్, సావిత్రిలు 14వ తేదీన వారి ఇంటికి వెళ్లి, ఈ వివాహానికి ఒప్పుకుంటున్నామని, ఘనంగా రిసెప్షన్ ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పి కూతుర్ని వెంట తీసుకువెళ్లారు. ఆ రాత్రే ఆమెను హతమార్చారు. ఆ తరువాత కూతుర్ని పాము కరిచింది అని ఇరుగు పొరుగు వారితో చెప్పి స్వగ్రామానికి తీసుకువెళ్ళి దహనం చేశారు. అభిషేక్ ఫిర్యాదు మేరకు భావన తల్లిదండ్రులను అదుపులోకి తీసుకున్నామని డిప్యూటీ కమీషనర్ సుమన్ గోయల్ తెలిపారు. తక్కువ కులం వాడిని వివాహం చేసుకొని బంధువుల ముందు తాము సిగ్గుపడేలా చేసినందుకే కూతురిని చంపామని వారు పోలీసుల ముందు అంగీకరించారు. అయితే ఆమెను ఎలా చంపారన్న విషయమై విచారణ జరుపుతున్నట్టు గోయల్ తెలిపారు. ఆమెను దహనం చేసిన చోటు నుంచి సేంపిల్స్ సేకరించి డి.ఎన్.ఎ. పరీక్షకు పంపినట్టు తెలిపారు.