: ఇండియాకు ఎబోలా భయం... ఆందోళన వద్దంటున్న ప్రభుత్వం
ఎబోలా వైరస్ సోకిన వారిని గుర్తించేందుకు విమానాశ్రయాలలో మరిన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టు ప్రభుత్వం వెల్లడించింది. ఇందుకోసం ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని నియమించినట్టు కేంద్ర ఆరోగ్య శాఖా మంత్రి జేపీ నద్దా వెల్లడించారు. ఇండియాలోకి ఎబోలా వైరస్ రావటం కొంత ఆందోళన కలిగిస్తున్నప్పటికీ, పరిస్థితి నియంత్రణలోనే ఉందని ఆయన అన్నారు. అనుభవజ్ఞులైన డాక్టర్ల బృందం అన్ని ప్రధాన నగరాల్లో పర్యటించి ఎబోలా రోగులకు చేయాల్సిన చికిత్స, ఆసుపత్రులలో తీసుకోవాల్సిన చర్యలపై సూచనలు అందించనున్నారని తెలిపారు. కాగా, లైబీరియా నుంచి ఢిల్లీ వచ్చిన 26 సంవత్సరాల యువకుడికి ఎబోలా వైరస్ సోకినట్టు ఎయిర్ పోర్ట్ అధికారులు కనుగొన్న సంగతి తెలిసిందే. విదేశాల నుంచి వచ్చేవారు ఎవరైనా వారి 21 రోజుల ప్రయాణ చరిత్రను అధికారులు పరిశీలిస్తారని, ఆ తరువాత ఎబోలా పరీక్షలు నిర్వహించిన మీదటే బయటకు పంపుతారని తెలిపారు.