: అబ్బే..అలాంటిదేమీ లేదే!: ఓబులేష్ అరెస్ట్ పై హైదరాబాద్ పోలీస్ కమిషనర్


హైదరాబాద్ లో కలకలం రేపిన కాల్పుల ఘటనలో నిందితుడు అరెస్టయ్యాడన్న వార్తలను నగర పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డి ఖండించారు. బుధవారం కేబీఆర్ పార్కు వద్ద అరబిందో ఫార్మా వైస్ ప్రెసిడెంట్ నిత్యానందరెడ్డిపై కాల్పులు జరిపిన వ్యక్తిని ఏఆర్ కానిస్టేబుల్ ఓబులేష్ గా గుర్తించారని, అనంతపురంలో అతడిని అరెస్ట్ చేసి హైదరాబాద్ తరలిస్తున్నారని గురువారం ఉదయం నుంచి పలు వార్తా ఛానెళ్లలో వార్తలు ప్రసారమయ్యాయి. అయితే ఈ వార్తలను పోలీస్ కమిషనర్ ఖండించారు. ఇదిలా ఉంటే, కాల్పులకు పాల్పడింది ఓబులేషేనని గుర్తించిన పోలీసు ఉన్నతాధికారులు, అతడిని అరెస్ట్ చేసేందుకు టాస్క్ ఫోర్స్ ను రంగంలోకి దించారు. బుధవారం రాత్రి కర్నూలు-అనంతపురం సరిహద్దుల్లో టాస్క్ ఫోర్స్ పోలీసులు ఓబులేష్ ను అదుపులోకి తీసుకున్నారని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. అంతేకాక అదుపులోకి తీసుకున్న ఓబులేష్ ను బుధవారం రాత్రే హైదరాబాద్ తరలించి రహస్య ప్రదేశంలో విచారణ మొదలుపెట్టారని సదరు వర్గాలు వెల్లడిస్తున్నాయి. నిందితుడి నుంచి పూర్తి వివరాలు రాబట్టేదాకా అరెస్ట్ ను ధ్రువీకరించరాదన్న భావనతోనే కమిషనర్ ఆ ప్రకటన చేసి ఉంటారన్న వాదనా వినిపిస్తోంది. ఇదిలా ఉంటే, ఓబులేష్ ది కడప జిల్లా పోరుమామిళ్లగా పోలీసులు నిర్ధారించినట్లు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News