: చెల్లెలి బాయ్ ఫ్రెండ్ చేతిలో మిస్ హోండురాస్ కాల్చివేత
అందాల సుందరిగా గుర్తింపు వచ్చింది. మిస్ వరల్డ్ పోటీలలో పాల్గొనేందుకు బయలుదేరాల్సివుంది. ఇంతలోనే మృత్యువు చెల్లెలి బాయ్ ఫ్రెండ్ రూపంలో వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మిస్ హోండురాస్ గా ఎంపికై లండన్ లో జరిగే ప్రపంచ సుందరి పోటీలకు సిద్ధమవుతున్న మరియా జోసె అల్వరాడో (19) తన చెల్లెలు సోఫియాతో కలసి వారం క్రితం ఓ పార్టీకి వెళ్ళింది. సోఫియా మరొకరితో డాన్సు చేయటాన్ని చూసి సహించలేకపోయిన ఆమె బాయ్ ఫ్రెండ్ ప్లుటార్కో రూయిజ్ తొలుత సోఫియాను, ఆ తరువాత అల్వరాడోను కాల్చి చంపాడు. ఆ తరువాత వారి మృత దేహాలను అరాడా పట్టణం సమీపంలోని అగువాల్ నదీ తీరంలో పూడ్చిపెట్టాడు. మంగళవారం నాడు రూయిజ్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అతని వద్ద నుంచి కోల్ట్-45 పిస్టల్ ను స్వాధీనం చేసుకున్నారు.