: ఆధార్ లేకపోతే... వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ కట్!
పంట పొలానికి నీరు పెట్టేందుకు విద్యుత్ కనెక్షన్ తీసుకున్న రైతన్న తప్పనిసరిగా ఆధార్ కార్డును కలిగి ఉండాల్సిందే. ఎందుకంటే, ఆధార్ నెంబర్ లేకుంటే, అతడి విద్యుత్ కనెక్షన్ కట్ కాబోతోంది. ఏపీలో ఈ రోజు నుంచే ఈ ఆదేశాలను తప్పనిసరిగా అమలు చేయాలని విద్యుత్ పంపిణీ సంస్థలు తమ క్షేత్ర స్థాయి సిబ్బందికి ఆదేశాలు జారీ చేశాయి. ప్రతి అంశానికీ ఆధార్ తో లంకె పెడుతున్న ప్రభుత్వం, తాజాగా వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ కు కూడా దానిని విస్తరించింది. ఈ కొత్త నిబంధన ప్రకారం ప్రతి రైతు తన వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ కు తన ఆధార్ నెంబరును జత చేయాల్సి ఉంది. లేకపోతే ట్రాన్స్ కో అధికారులు సదరు కనెక్షన్ ను ఎలాంటి ముందస్తు నోటీసు ఇవ్వకుండానే కట్ చేసేస్తారు.