: టాలీవుడ్ 'మేము సైతం' కార్యక్రమం టికెట్ ధర రూ. లక్ష
హుదూద్ తుపాను బాధితులను ఆదుకోవడానికి తెలుగు చిత్ర పరిశ్రమ చేపడుతున్న భారీ కార్యక్రమం 'మేము సైతం'. ఈ కార్యక్రమాన్ని ఈ నెల 29, 30 తేదీల్లో నిర్వహించనున్నారు. 29వ తేదీ రాత్రి 7.30 గంటల నుంచి 10.30 వరకు నటీనటులతో విందు కార్యక్రమం ఉంటుందని చిరంజీవి, నాగార్జున తెలిపారు. కేవలం 250 జంటలకు మాత్రమే ప్రవేశముంటుందని... జంట అంటే భార్యాభర్తలు కావచ్చు, అన్నాదమ్ములు కావచ్చు, ఎవరైనా ఇద్దరు వ్యక్తులు కావచ్చని చెప్పారు. ఒక్కో జంటకు టికెట్ ధర రూ. లక్ష అని తెలిపారు. కాంప్లిమెంటరీ పాస్ లు ఉండవని స్పష్టం చేశారు. అంతేకాకుండా, ఈవెంట్ లో భాగంగా ఆటలు, పాటలు, డ్యాన్సులు వంటి ఎన్నో కార్యక్రమాలు ఉంటాయని నాగార్జున చెప్పారు. ఈ కార్యక్రమాల టికెట్ ధరలు రూ. 500 నుంచి రూ. లక్ష వరకు ఉంటాయని చెప్పారు. తొలి టికెట్ ను నిర్మాత అల్లు అరవింద్ కొన్నారు. టికెట్లు సికింద్రాబాద్ క్లబ్, ఫిల్మ్ నగర్ క్లబ్ లాంటి చోట్ల దొరుకుతాయని, బుక్ మై షో ద్వారా కూడా పొందవచ్చని తెలిపారు. మరిన్ని వివరాలకు memusaitam.com అనే వెబ్ సైట్ లో సంప్రదించవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమానికి చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, శ్రీకాంత్, సురేష్ బాబు, అల్లు అరవింద్ తదితరులు హాజరయ్యారు.