: సామాన్యుడి నుంచి సొంత సైన్యం వరకు... రాంపాల్ బాబా
పత్రికలు, టీవీల్లో మారుమోగుతున్న బాబా రాంపాల్ ఎంతో సామాన్యమైన స్థితి నుంచి వేలాది మంది భక్తుల ఆరాధ్య దైవంగా ఎదిగాడు. 1951 సెప్టెంబర్ 8న హర్యానా రాష్ట్రంలోని సోనిపట్ జిల్లా ధనాన గ్రామంలో రాంపాల్ జన్మించాడు. తండ్రి నంద్ లాల్ ఓ సామాన్య రైతు. తల్లి ఇందిరాదేవి సాధారణ గృహిణి. చిన్నతనం నుంచే ఆధ్యాత్మిక చింతన ఎక్కువగా ఉన్న రాంపాల్ ఐటీఐ చదివి, హర్యానా ఇరిగేషన్ శాఖలో ఉద్యోగం సంపాదించాడు. 1995 వరకు జూనియర్ ఇంజినీర్ గా పనిచేసి, ఆ తర్వాత బాబా అవతారం ఎత్తాడు. 25 ఏళ్లపాటు హనుమంతుడిని భక్తిభావంతో పూజించిన రాంపాల్... ఆ తర్వాత తనను తాను కబీర్ ప్రవక్తగా చెప్పుకుని స్వామీజీగా అవతరించాడు. తొలుత అట్టడుగు వర్గాల ప్రజలను ఆకర్షించిన రాంపాల్ అతి తక్కువ కాలంలోనే బాగా పాప్యులర్ అయ్యాడు. "దేవుళ్లను మొక్కకండి. ఉపవాసాలు ఉండకండి. మీ ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వని హిందూ మతంలోని ఎలాంటి నియమాలను, నిష్టలను పాటించకండి. దేవుడిని నేరుగా చేరుకోవడానికి ఎలాంటి మార్గం లేదు" అంటూ రాంపాల్ చేసిన ఉపదేశాలు అట్టడుగు వర్గాలను విపరీతంగా ఆకర్షించాయి. తదనంతర కాలంలో ఉన్నత శ్రేణికి చెందిన వారు కూడా రాంపాల్ భక్తులుగా మారారు. హర్యానా మాజీ ముఖ్యమంత్రి భూపీందర్ సింగ్ హుడా సతీమణి ఆశా హుడా కూడా రాంపాల్ భక్తురాలే. అంతా సవ్యంగా జరుగుతున్న సమయంలో 2006 జూన్ లో రాంపాల్ కు కష్టాలు మొదలయ్యాయి. మత ఘర్షణల కారణంగా రోహ్ తక్ జిల్లాలోని కరొంతా ఆశ్రమాన్ని రాంపాల్ ఖాళీ చేయాలని పోలీసులు బలవంతం చేశారు. ఈ ఘర్షణల్లో ఓ వ్యక్తి తుపాకీ గుళ్లకు బలయ్యాడు. రాంపాల్ కు వ్యతిరేకంగా పోలీసు కేసు నమోదయింది. కేసు విషయంలో కోర్టుకు హాజరు కాకుండా, ఏదో ఒక కారణం చెబుతూ రాంపాల్ తప్పించుకునేవాడు. దీంతో, కోర్టు ఏకంగా 43 సార్లు వారెంట్ లు జారీ చేసింది. కాలక్రమంలో, ఆశ్రమం చుట్టూ రాంపాల్ సొంత సైన్యాన్ని తయారు చేసుకున్నాడు. ఎన్నిసార్లు వారెంట్ లు జారీ చేసినా కోర్టుకు హాజరుకాకపోవడంతో... చివరకు కోర్టు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. అరెస్ట్ చేసేందుకు వచ్చిన పోలీసులకు షాక్ ఇచ్చాడు రాంపాల్ బాబా. అతని అనుచరులు పోలీసులపైనే కాల్పులకు తెగబడ్డారు. ఆశ్రమమంతా ఉద్రిక్తత నెలకొంది. ఆరు మంది చనిపోయారు. వందలాది మంది గాయపడ్డారు. భారీ సంఖ్యలో పోలీసులకు కూడా గాయాలయ్యాయి. చివరకు పోలీసులు బాబా రాంపాల్ ను అరెస్ట్ చేశారు. అంతేకాకుండా, అతని అనుచరులు 450 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఇదీ... సామాన్య రైతు కుటుంబంలో పుట్టి, బాబాగా అవతరించి, ప్రైవేటు సైన్యాన్ని ఏర్పాటు చేసుకుని, పోలీసులను సైతం ముప్పుతిప్పలు పెట్టిన బాబా రాంపాల్ జీవితగాథ.