: జంక్ ఫుడ్ ఎక్కువగా తింటే మెమొరీ పవర్ తగ్గుతుందట!
నేటి స్పీడ్ యుగంలో యువత ఎక్కువగా జంక్ ఫుడ్ పైనే ఆధారపడుతోంది. బిజీ లైఫ్ లో లభించే కొద్దిపాటి విరామాల్లో వారు ఫాస్ట్ ఫుడ్ ఐటమ్స్ తినడానికే ప్రాధాన్యత ఇస్తున్నారు. రుచిగా ఉంటాయి కానీ, వాటిల్లో ఉండే రసాయనాలు ఆరోగ్యాన్ని దీర్ఘకాలంలో దెబ్బతీస్తాయని నిపుణులు ఎప్పటినుంచో హెచ్చరిస్తున్నారు. తాజాగా, యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియా చేపట్టిన అధ్యయనంలో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. జంక్ ఫుడ్ ను అధికంగా తీసుకోవడం ద్వారా వ్యక్తుల్లో జ్ఞాపకశక్తి దెబ్బతింటుందని పరిశోధనకు నాయకత్వం వహించిన డాక్టర్ బీట్రిస్ గొలోంబ్ తెలిపారు. జంక్ ఫుడ్ ను అధికంగా తినే సుమారు 1000 మంది ఆరోగ్యవంతులపై ఈ మేరకు పరిశోధన నిర్వహించారు. కొన్ని పదాలతో వారి జ్ఞాపకశక్తికి పరీక్ష పెడితే అధ్వానమైన ఫలితాలు వచ్చాయట. దీనిపై గొలోంబ్ వివరిస్తూ, జంక్ ఫుడ్ లో ఉండే ప్రోఆక్సిడాంట్లు కణశక్తికి వ్యతిరేకంగా పనిచేస్తాయని తెలిపారు. తద్వారా ఆరోగ్యం దెబ్బతినడమే కాకుండా, మెదడు పనితీరు మందగిస్తుందని అన్నారు. క్రమేణా జ్ఞాపకశక్తి తరిగిపోతుందని పేర్కొన్నారు.