: విభజన చట్టాన్ని కేసీఆర్ అన్ని రంగాల్లో ఉల్లంఘిస్తున్నారు: ఏపీ మంత్రులు
ఏపీ మంత్రులు గంటా శ్రీనివాసరావు, కామినేని శ్రీనివాస్, అచ్చెన్నాయుడు హైదరాబాదులో గవర్నర్ నరసింహన్ ను కలిశారు. ఆయనతో భేటీ అనంతరం వారు మాట్లాడుతూ, విభజన చట్టాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని రంగాల్లో ఉల్లంఘిస్తున్నారని మండిపడ్డారు. గంటా మాట్లాడుతూ, ఇంటర్ పరీక్షలు ఉమ్మడిగానే నిర్వహించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఇంటర్ పరీక్షలు విడివిడిగా నిర్వహిస్తే ఎంసెట్ ఉమ్మడి ప్రవేశాల్లో ఏపీ విద్యార్థులు నష్టపోతారని గవర్నర్ కు తెలిపామన్నారు. రాజకీయాల కోసం విద్యార్థుల భవిష్యత్ నాశనం చేయకూడదని ఆయన హితవు పలికారు. రేపు సాయంత్రం రెండు రాష్ట్రాల విద్యాశాఖ మంత్రులతో గవర్నర్ సమావేశమవుతారని గంటా తెలిపారు.