: మంత్రివర్గ సమావేశంలో ఏపీ ప్రభుత్వ నిర్ణయాలు
ఏపీ మంత్రివర్గ సమావేశం హైదరాబాదులోని సచివాలయంలో రెండు గంటల నుంచి కొనసాగుతోంది. ఈ సందర్భంగా పలు నిర్ణయాలు తీసుకున్న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రధానంగా హుదూద్ వల్ల దెబ్బతిన్న పరిశ్రమలను ఆదుకునేందుకు ఉత్తర్వులు ఇవ్వగా, పెండింగులో ఉన్న రాయితీలు, గ్రాంట్లు, ప్రోత్సాహకాల విడుదలకు ఆదేశించింది. ఈ మేరకు పరిశ్రమల శాఖ కమిషనర్ కు ఆదేశాలు జారీ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. అక్టోబర్ నెలకు కనీస విద్యుత్ ఛార్జీలు వసూలు చేయొద్దని ఆదేశించింది. బీమా లేని సూక్ష్మ యూనిట్ లకు రూ.25 వేలు, బీమాలేని చిన్న, మధ్య తరహా పరిశ్రమల యూనిట్లకు రూ.50వేల సాయం చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. సెప్టెంబర్ విద్యుత్ బిల్లును మూడు వాయిదాల్లో చెల్లించేందుకు వెసులుబాటు కల్పించడానికి, ఆస్తిపన్ను చెల్లింపునకు ఆరు నెలల గడువు ఇచ్చేందుకు అంగీకరించారు. పారిశ్రామిక పార్కుల్లో మరమ్మతు పనులను మూడు నెలల్లో పూర్తి చేయాలని ఆదేశించింది.