: ఉద్రిక్తంగా మారిన అంగన్ వాడీ కార్యకర్తల ఛలో హైదరాబాద్
వేతనాల పెంపును డిమాండ్ చేస్తూ మంగళవారం అంగన్ వాడీ కార్యకర్తలు చేపట్టిన ఛలో హైదరాబాద్ కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. మంగళవారం ఉదయం తెలంగాణలోని వివిధ ప్రాంతాల నుంచి హైదరాబాద్ బయలుదేరిన అంగన్ వాడీ కార్యకర్తలను పోలీసులు ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తున్నారు. మహబూబ్ నగర్, నల్లగొండ జిల్లాల్లో పెద్ద సంఖ్యలో అంగన్ వాడీ కార్యకర్తలు అరెస్టయ్యారు. అరెస్టయిన కార్యకర్తలు పోలీస్ స్టేషన్ల వద్దే ఆందోళనలకు దిగారు. అరెస్టుల సమాచారం అందుకున్న మిగిలిన అంగన్ వాడీ కార్యకర్తలు ఎక్కడికక్కడ ఆందోళనలకు దిగేందుకు సిద్ధమవుతున్నారు. దీంతో హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలన్నింటిలోనూ కార్యకర్తల ఆందోళనలు జరిగే ప్రమాదముందని భావిస్తున్న పోలీసులు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. దీంతో పలు ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.