: ఈ-టెయిలింగ్ ను నిషేధించండి: బెజవాడ సెల్ ఫోన్ డీలర్లు
ఈ-కామర్స్ సంస్థల కార్యకలాపాలపై సెల్ ఫోన్ డీలర్లు సమరశంఖం పూరించారు. దేశంలో రీటెయిల్ వ్యవస్థను ఛిన్నాభిన్నం చేస్తున్న ఈ-టెయిలింగ్ కార్యకలాపాలను నిషేధించాలని మంగళవారం ఉదయం విజయవాడలో సెల్ ఫోన్ డీలర్లు ఆందోళనకు దిగారు. అమెజాన్, ఫ్లిప్ కార్ట్, స్నాప్ డీల్ తరహా కంపెనీల రంగ ప్రవేశంతో తమ జీవనోపాధి ప్రశ్నార్థకంగా మారుతోందని ఈ సందర్భంగా వారు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం సెల్ ఫోన్ విక్రయాలు ఆన్ లైన్ లోనే జరిగిపోతున్నాయి. దీంతో సెల్ ఫోన్ ల కోసం రిటెయిల్ ఔట్ లెట్లకు వస్తున్న వారి సంఖ్య తగ్గిపోతోంది. ఇతర రంగాలపై ఈ ప్రభావం కాస్త నెమ్మదిగా పడుతోంటే, సెల్ ఫోన్ల రిటెయిల్ విక్రయాలపై మాత్రం రోజుల వ్యవధిలో ఈ-కామర్స్ సంస్థలు తమ ప్రతాపాన్ని చూపాయి. దీంతో డీలర్లు ఆందోళనకు దిగక తప్పని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో విజయవాడ సెల్ ఫోన్ డీలర్లు నేడు ఆందోళన బాట పట్టారు. తమ జీవనోపాధిని అయోమయంలో పడేస్తున్న ఈ-కామర్స్ సంస్థల కార్యకలాపాలను నిషేధించాలని వారు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.