: పాము కరచినా.. ఈ స్పాంజి ఉంటే బతికిపోతాం
రక్తంలో విషకణాలున్నట్లయితే.. వాటిని క్లీన్ చేసేసే ఒక అతిసూక్ష్మమైన స్పాంజిని శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. రక్తంలోకి పాము విషం ఎక్కినా కూడా ఇది శుభ్రం చేసేస్తుందిట. యాంటీబయోటిక్స్‌కు లొంగని అనేక రకాల ప్రాణాంతక బ్యాక్టీరియాలు కూడా దీని ముందు నిలువలేవు.
దీనిపై పరిశోధనలు చేసిన శాస్త్రవేత్తలు ముందుగా స్టెఫిలోకాకస్ బ్యాక్టీరియాను ఎలుకలకు ఎక్కించారు. స్పాంజిని రక్తంలోకి ప్రవేశపెట్టగా.. 44శాతం ఎలుకలు బతికాయి. ఈ స్పాంజి కూడా ఎర్ర రక్తకణాల రంగులోనే ఉండి విషకణాలను ఆకర్షించి.. తనలోని సూక్ష్మ రంధ్రాల్లో వాటిని బంధిస్తుంది. తద్వారా రక్తం శుభ్రపడుతుంది. ఈ స్పాంజిని ఇంజక్షన్ల ద్వారా మనుషుల రక్తంలోకి ఎక్కించగలిగే పద్ధతి కనుక్కుంటే.. అనేక జబ్బులకు పరిష్కారం దొరికినట్లు అవుతుందని అంచనా వేస్తున్నారు.