: 'బ్రిక్స్ బ్యాంక్' చీఫ్ పోస్టుకు పరిశీలనలో ఆర్బీఐ గవర్నర్ పేరు
బ్రిక్స్ దేశాలు సంయుక్తంగా 'బ్రిక్స్ న్యూ డెవలప్ మెంట్ బ్యాంక్'ను త్వరలో ఏర్పాటు చేయనున్న సంగతి తెలిసిందే. ఈ బ్యాంకుకు అధిపతిగా నియమించే వ్యక్తుల జాబితాలో ఆర్ బీఐ గవర్నర్ రఘురాం రాజన్ పేరు కూడా ఉందంటున్నారు. ఈ పదవికి ఆయనతో పాటు ఓ కేంద్ర మంత్రి, మౌలిక సదుపాయాల ఆర్థిక రంగంలో అనుభవజ్ఞుడైన బ్యాంకర్ ల పేర్లను పరిశీలిస్తున్నారట. వారిలో సరైన వ్యక్తిని త్వరలో ఎంచుకోనున్నారని, ప్రస్తుతం ఈ అంశం పరిశీలనలో మాత్రమే ఉందని వినికిడి. అయితే, ఇంకా పలువురి పేర్లను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం పరిశీలిస్తుందని ఆర్థికమంత్రిత్వ శాఖ వర్గాల సమాచారం. అటు, ఈ విషయమై ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం రాజన్ ను సంప్రదించలేదంటున్నారు. రెండు రోజుల కిందట (శనివారం) బ్రిస్బేన్ లో జరిగిన బ్రిక్స్ నేతల సమావేశంలో మోదీ మాట్లాడుతూ, బ్రిక్స్ బ్యాంకును 2016 కల్లా ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. త్వరలోనే బ్రిక్స్ బ్యాంక్ అధ్యక్ష పదవికి తమ అభ్యర్థిని ఎన్నుకుంటామని స్పష్టం చేశారు. బ్యాంక్ తొలి అధ్యక్షుడిని భారత్ నియమించేందుకు ఇటీవల ఫోర్టలేజాలో జరిగిన ఆరవ సదస్సులో బ్రిక్స్ దేశాలు అంగీకరించాయి.