: మెట్రో భూములపై చర్చ నిర్వహించాల్సిందే: రేవంత్ రెడ్డి
హైదరాబాద్ మెట్రో రైలు భూములపై సభలో చర్చ నిర్వహించాల్సిందేనని టీ టీడీఎల్పీ ఉప నేత రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం అసెంబ్లీ వాయిదా పడిన తర్వాత మీడియా పాయింట్ వద్ద విలేకరులతో మాట్లాడిన సందర్భంగా ఆయన ఈ మేరకు డిమాండ్ చేశారు. మెట్రో భూములపై చర్చ జరిపితే తమ బండారం బయటపడుతుందని ప్రభుత్వం భయపడుతోందని ఆయన అన్నారు. రామేశ్వరరావుకు అప్పగించిన భూములకు ఎలాంటి అనుమతులు లేవన్నారు. మెట్రో భూముల వ్యవహారంలో అక్రమాలు జరగలేదని చెబుతున్న ప్రభుత్వం, శాసన సభా సంఘం చేత విచారణ చేయించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ భూముల వ్యవహారం బయటపడుతుందన్న భావనతోనే కేసీఆర్ సర్కారు తమను సభ నుంచి సస్పెండ్ చేసిందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. మెట్రో భూములకు సంబంధించి తాను చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉన్నానని ఆయన ప్రకటించారు. దీనిపై చర్చకు సభలోనే కాక ఎక్కడైనా సరే తాను సిద్ధమేనని స్పష్టం చేశారు.