: విజయవాడలో రాత్రి సంచరించాలంటే గుర్తింపు కార్డులుండాల్సిందే!
విజయవాడ నగరంలో ఇకపై రాత్రి సంచరించాలంటే గుర్తింపు కార్డులుండాల్సిందే. ఆపరేషన్ నైట్ డామినేషన్ పేరిట బెజవాడ పోలీసులు ఆదివారం రాత్రి ప్రారంభించిన సరికొత్త భద్రతా చర్యలు నగర ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. ఆదివారం రాత్రి దాదాపు 200 మందికి పైగా నగరవాసులను పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్లకు తరలించారు. పోలీసుల అదుపులోని వారిలో దినసరి కూలీలే అధికంగా ఉన్నారని సమాచారం. కేవలం గుర్తింపు కార్డులు లేని కారణంగానే వీరిని పోలీసులు ఎక్కడికక్కడ అదుపులోకి తీసుకున్నారు. అయితే దినసరి కూలీలుగా కాలం వెళ్లదీస్తున్న తాము గుర్తింపు కార్డులను ఎలా వెంటబెట్టుకుని వెళతామంటూ కూలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలీసుల తాజా ఆపరేషన్ నేపథ్యంలో రాత్రి 11 గంటలు దాటితే బయటకు వచ్చేందుకు నగరవాసులు బెంబేలెత్తిపోతున్నారు. అయితే నగరంలో నేరాలను కట్టడి చేసేందుకే నైట్ డామినేషన్ ఆపరేషన్ కు తెర తీసినట్లు నగర పోలీసు కమిషనర్ ఏబీ వెంకటేశ్వరరావు తెలిపారు.