: బెదిరించి భూములు లాక్కుంటే ఉద్యమిస్తాం: రఘువీరా
ఏపీ పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి సర్కారుపై నిప్పులు చెరిగారు. రాజధాని నిర్మాణం కోసం రైతుల నుంచి బలవంతంగా భూములను లాక్కుంటే ఉద్యమిస్తామని హెచ్చరించారు. రాజధాని నిర్మాణం అంశంలో టీడీపీ సర్కారు రైతులకు, జిల్లాలకు మధ్య చిచ్చు పెడుతోందని రఘువీరా మండిపడ్డారు. రాజధానిని సింగపూర్ లా ఏర్పాటు చేస్తామంటూ, రియల్ ఎస్టేట్ వ్యాపారానికి తెరదీశారంటూ ఆరోపించారు. రాజధాని ఏర్పాటుకు తొలుత లక్ష ఎకరాలు అవసరమన్న చంద్రబాబు నాయుడు ఇప్పుడు 30 వేల ఎకరాలు అనడంలో అర్థమేంటని పీసీసీ చీఫ్ ప్రశ్నించారు. అటు, కేసీఆర్ పైనా రఘువీరా ధ్వజమెత్తారు. కేసీఆర్ సీఎంలా కాకుండా, ఓ ఉద్యమకారుడిలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. తాజా పరిణామాల నేపథ్యంలో, కేసీఆర్, చంద్రబాబు రాజకీయ లబ్ధి పొందాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.