: బదిలీ వివాదాలకు దూరంగా ఉండండి: మంత్రులకు చంద్రబాబు ఆదేశం
ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలకు సంబంధించిన వివాదాలకు దూరంగా ఉండాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తన మంత్రివర్గ సహచరులకు ఆదేశాలు జారీ చేశారు. ఆదివారం విశాఖ జిల్లా సీనియర్ నేత, మంత్రి అయ్యన్నపాత్రుడు తనను కలిసిన తర్వాత చంద్రబాబు మంత్రులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మంత్రుల వ్యవహార సరళికి సంబంధించి పలు సూచనలు చేశారు. అనవసరమైన వివాదాలకు దూరంగా ఉండాలని ఆయన మంత్రులకు ఆదేశాలు జారీ చేశారు. అంతేగాక, ప్రభుత్వ వ్యవహారాల్లో కుటుంబ సభ్యులను దూరంగా ఉంచాలని వారికి సూచించారు. ఏదైనా వివాదం తలెత్తితే సదరు మంత్రులే బాధ్యత వహించాల్సి ఉంటుందని, ఆ విషయాల్లో పార్టీతో పాటు ప్రభుత్వం కూడా ఏమాత్రం బాధ్యత వహించబోదని కూడా ఆయన కాస్త ఘాటుగానే స్పష్టం చేశారు.