: నేటి భారత్-లంక మ్యాచ్ కు ప్రేక్షకుడిగా టీమిండియా కెప్టెన్ ధోనీ


టీమిండియా రథసారధి, కెప్టెన్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీ నేడు రాంచీలో జరగనున్న భారత్-లంక మ్యాచ్ కు ప్రేక్షకుడిగా హాజరు కానున్నాడు. తన సొంత నగరం రాంచీలో ఐదో వన్డే జరుగుతున్న సంగతి తెలిసిందే. చేతి బొటనవేలి గాయం కారణంగా ఈ సిరీస్ నుంచి విశ్రాంతి కోరిన ధోనీ, రాంచీలో జరుగుతున్న మ్యాచ్ ను ప్రత్యక్షంగా వీక్షకుల స్టాండ్ నుంచి తిలకించే అవకాశముందని అధికార వర్గాల సమాచారం. నాలుగో వన్డేలో భాగంగా భారత స్టైలిష్ బ్యాట్స్ మన్ రోహిత్ శర్మ, 200 మార్కు దాటగానే 250 పరుగులు దాటేస్తాడని ముందే అనుకున్నానని ప్రకటించిన ధోనీ, సదరు మ్యాచ్ ను మాత్రం ప్రత్యక్షంగా వీక్షించలేదు. అయితే ఐదో మ్యాచ్ లో రోహిత్ ఆడుతున్నాడు. అంతేకాక బౌలర్లు కూడా మెరుగ్గా రాణిస్తున్నారు. మెరుగైన ఆటతీరుతో రాణిస్తున్న తన జట్టు ప్రదర్శనను ధోనీ ప్రత్యక్షంగా తిలకించేందుకు ఆసక్తిగా ఉన్నాడని సమాచారం. అంతేకాక నేటి వన్డేలో టీమిండియా గెలిస్తే, సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసినట్లవుతుంది. వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని ఈ మ్యాచ్ ను ప్రత్యక్షంగా వీక్షించాల్సిందేనని ధోనీ నిర్ణయం తీసుకున్నాడట. నేటి మధ్యాహ్నం 1.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.

  • Loading...

More Telugu News