: తారా చౌదరి వ్యవహారంలో నా ప్రమేయాన్ని నిరూపించండి: రేవంత్ రెడ్డి సవాల్


ప్రముఖులకు అమ్మాయిలను సరఫరా చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న తారా చౌదరి కేసులో తన ప్రమేయాన్ని నిరూపించాలని టీ టీడీఎల్పీ ఉప నేత రేవంత్ రెడ్డి, తెలంగాణ సర్కారుకు సవాల్ విసిరారు. శనివారం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడిన ఆయన, తెలంగాణ ప్రభుత్వ తీరుపై నిప్పులు చెరిగారు. ప్రభుత్వ విధానాలను ప్రశ్నిస్తున్నందునే తమను కేసీఆర్ సర్కారు టార్గెట్ చేస్తోందని ఆరోపించారు. తారా చౌదరి వ్యవహారంలో తన ప్రమేయం లేదని తాను ఎన్నడో చెప్పానని, అయితే మళ్లీ తెలంగాణ సర్కారు అదే ఆరోపణలు చేస్తూ తనను ఇరుకున పెట్టే యత్నం చేస్తోందని మండిపడ్డారు. అయితే ప్రభుత్వ కుయుక్తులు తన విషయంలో పనిచేయవని ఆయన స్పష్టం చేశారు. విధానపరంగా తమను ఎదుర్కోలేని ప్రభుత్వం ఓ అమ్మాయితో తనకు ఫోన్ చేయిస్తూ బెదిరింపులకు దిగుతోందని ఆయన విరుచుకుపడ్డారు. తనపై బురద చల్లేందుకు ఓ అమ్మాయిని వాడుకుంటున్న కేసీఆర్ సర్కారు ఏ స్థాయికి దిగజారిందో చెప్పకనే చెబుతోందన్నారు. ఎన్ని కుట్రలు పన్నినా, కేసీఆర్ అసంబద్ధ నిర్ణయాలపై రాజీలేని పోరు సాగిస్తానని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News