: మాట తప్పడం చంద్రబాబు నైజం: వైఎస్ జగన్
ప్రజలకిచ్చిన మాటను మరచి ప్రవర్తించడం ఏపీ సీఎం చంద్రబాబునాయుడుకే చెల్లిందని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. తన సొంత నియోజకవర్గం పులివెందుల పర్యటనలో భాగంగా జగన్ శనివారం వీరపునాయని పల్లెలో వైఎస్ఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ‘మాట ఇస్తే నిలబడాలి. ఇచ్చిన మాటను శిలాశాసనంలా పరిగణించాలి. వైఎస్ఆర్ మరణం తర్వాత రాజకీయాల్లో విలువలు దిగజారిపోయాయి’అని వ్యాఖ్యానించారు. విలువలు, విశ్వసనీయతకు వైఎస్ఆర్ మారుపేరని ఆయన అన్నారు. ఎన్నికలకు ముందు ఒక మాట, ఎన్నికల తర్వాత మరో మాటకు చంద్రబాబు తార్కాణంగా నిలిచారన్నారు. ‘ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండటం వైఎస్ఆర్ ను చూసి నేర్చుకోవాలి. ప్రజల గుండెల్లో వైఎస్ఆర్ చిరస్థాయిగా నిలిచిపోయారు. వైఎస్ఆర్ వెళ్తూ, వెళ్తూ నాకు ప్రజా కుటుంబాన్ని ఇచ్చి వెళ్లారు’ అని జగన్ చెప్పారు.