: తెలంగాణలో పెట్టుబడుల తిరోగమనం... కేసీఆర్ వైఖరే కారణం: నాగం
తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు తిరోగమన బాట పడుతున్నాయని బీజేపీ నేత నాగం జనార్ధన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. కొత్త రాష్ట్రానికి పెట్టుబడులు వెల్లువెత్తాల్సింది పోయి, వచ్చిన పెట్టుబడులు వెనక్కెళ్లిపోతున్నాయని ఆయన శనివారం ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దుస్థితికి సీఎం కేసీఆర్ వైఖరే కారణమని కూడా ఆయన ఆరోపించారు. ఓ వైపు కేంద్రంలో అధికారం చేపట్టిన నరేంద్ర మోదీ పెట్టుబడుల ప్రవాహన్ని రాబడుతుంటే, కేసీఆర్ వచ్చిన పెట్టుబడులను నిలబెట్టుకోలేకపోతున్నారని ఆరోపించారు. కేసీఆర్ ఇదే వైఖరిని కొనసాగిస్తే భవిష్యత్తులో తెలంగాణ ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆయన చెప్పారు. ఇప్పటికైనా కల్లబొల్లి మాటలను కేసీఆర్ కట్టిపెట్టి అభివృద్ధి వైపు దృష్టి సారించాలని ఆయన డిమాండ్ చేశారు.