: నా జీవితం నాశనమైంది...పోలీసులం కనుక ఏదైనా చేస్తామనే భావం వాళ్ళలో వుంది: మహిళా ఎస్సై భర్త ఆవేదన


తన జీవితం నాశనమైపోయిందని, ఇంకొకరి జీవితం తనలా కాకూడదని వరంగల్ మహిళా ఎస్సై భర్త సునీల్ ఆవేదన వ్యక్తం చేశాడు. చెన్నైలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పని చేస్తున్న తాను పోలీసులంటే ఉన్న గౌరవంతోనే ఎస్సైను పెళ్లి చేసుకున్నానని, పెళ్లైన ఏడాది కూడా గడవక ముందే కరీంనగర్ జిల్లాకు చెందిన సీఐ స్వామితో ఆమెకున్న అనుబంధం బయటపడిందని వాపోయాడు. బాధ్యతాయుతమైన ఉద్యోగంలో ఉన్న వాళ్లే ఇలాంటి అకృత్యాలకు పాల్పడితే, సమాజం ఏ దారిలో పయనిస్తుందని ప్రశ్నించారు. పోలీసులం కనుక ఏం చేసినా పర్లేదు అనే భావనతో ఉన్నారని ఆయన విమర్శించారు. అవసరమైతే మర్డర్ చేయించగలనని సీఐ స్వామి తనను బెదిరిస్తున్నారని సునీల్ పేర్కొన్నారు. తన భార్య కానిస్టేబుల్ గా పనిచేస్తున్ననాటి నుంచే వారిద్దరి మధ్య వివాహేతర సంబంధం ఉందని పుకార్లు వినిపిస్తున్నాయని, వారి కాల్ లిస్టులు బయటికి తీసి దర్యాప్తు చేస్తే నిజానిజాలు వెలికి వస్తాయని సునీల్ సూచించారు. తానిప్పటికే డీజీపీ అపాయింట్ మెంట్ కోరానని, వారిని విధుల నుంచి శాశ్వతంగా తొలగించాలని కోరతానని ఆయన తెలిపారు. తనకు రక్షణ కల్పించాలని, సీఐ, ఎస్సై కలసి తనను చంపే కుట్ర చేస్తారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కాగా, దొరికిపోయిన సీఐ, ఎస్సై లను డీఐజీ కార్యాలయానికి అటాచ్ చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి.

  • Loading...

More Telugu News