: సచిన్ పీఆర్ కండ్రిగకే ఎందుకు వస్తున్నాడు?
సచిన్ టెండూల్కర్ నెల్లూరు జిల్లాలోని ఓ కుగ్రామాన్ని దత్తత తీసుకున్నాడు. ఆదివారం నాడు స్వయంగా ఆ గ్రామాన్ని సందర్శించనున్నాడు. ఈ విషయాలు అందరికీ తెలిసినవే. అయితే సచిన్ పీఆర్ కండ్రిగనే ఎందుకు ఎంచుకున్నాడు? ఈ కుగ్రామం గురించి ఆయనకు ఎలా తెలిసింది? దాదాపు రెండు నెలల క్రితం నెల్లూరు జాయింట్ కలెక్టర్ రేఖా రాణి విదేశాల నుంచి వస్తుండగా విమానంలో సచిన్ కనిపించాడు. ఆమె ఆయన దగ్గరకు వెళ్లి పరిచయం చేసుకుని, తమ జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి పనుల గురించి చెప్పి ఎంపీ హోదాలో కొన్ని నిధులు అందించాలని, ఏదైనా ఒక గ్రామాన్ని దత్తత తీసుకోవాలని కోరారు. అప్పటికే ప్రధాని మోదీ 'దత్తత' పిలుపు ఇచ్చారన్న విషయాన్ని గుర్తు చేసిన సచిన్, తనకూ ఆ ఆలోచన ఉందని చెప్పాడు. అప్పుడే ఆమె కండ్రిగ గ్రామం గురించి ఆయనకు చెప్పారు. విమానం దిగిన తరువాత కూడా రేఖా రాణి చెప్పిన గ్రామం పీఆర్ కండ్రిగ సచిన్ మనసులో నిలిచిపోయింది. దాంతోనే అయన అదే గ్రామాన్ని ఎంచుకున్నాడు. ఇది సచిన్ పీఆర్ కండ్రిగను ఎంచుకోవడానికి కారణం!