: ప్రధానిని కాలేకపోయినందుకు విచారం లేదు: అద్వానీ
దేశ ప్రధానిని కాలేకపోయినందుకు ఎలాంటి విచారం లేదని బీజేపీ కురువృద్ధుడు ఎల్ కే అద్వానీ తెలిపారు. బీహార్ లో ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, అన్ని రాజకీయ పక్షాలు తనకు ప్రధాని కంటే ఎక్కువ గౌరవాన్నే ఇస్తున్నాయని అన్నారు. పార్లమెంటులో ప్రధాని హోదా కంటే ఎక్కువ అభిమానాన్ని తాను పొందానని ఆయన పేర్కొన్నారు. మోదీ పాలనపై అప్పుడే ఓ అభిప్రాయానికి రావడం సరికాదని ఆయన పేర్కొన్నారు. పరిపాలన మాత్రం భేషుగ్గా ఉందని ఆయన కితాబిచ్చారు. ఎన్డీయే ప్రభుత్వం ఇప్పటి వరకు ఆక్షేపించదగ్గ పనులేవీ చేయలేదని ఆయన తెలిపారు. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న విమర్శలపై ఆయన స్పందిస్తూ, వారి తప్పిదాల వల్లే తాము అధికారంలోకి వచ్చామన్న విషయం గుర్తించాలని పేర్కొన్నారు.