: కొనసాగుతున్న అల్ప పీడనం... మరింత వర్ష సూచన
నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతుండటంతో మరో రెండు రోజులపాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడవచ్చని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఇరు రాష్ట్రాలలోని పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఖమ్మం జిల్లాలో పలు చోట్ల పిడుగులు పడగా నలుగురు వ్యక్తులు మృత్యువాత పడ్డారు. పుణ్యక్షేత్రం తిరుమలలో రెండు రోజులుగా వర్షం పడుతోంది. దీంతో రోడ్లన్నీ జలమయం కాగా, శ్రీవారి భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. తిరుమలకు వెళ్లే ఘాట్‌రోడ్డులో అక్కడక్కడా కొండచరియలు విరిగి పడుతున్నాయి. నెల్లూరు జిల్లాలో సగటున 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. గుంటూరు, ప్రకాశం జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో 5 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదు అయ్యింది. అల్పపీడనం కారణంగా రాగల 48 గంటల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రాంతాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు విశాఖ వాతావరణ శాఖ తెలిపింది. సముద్రంలో వేటకు వెళ్లే మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.