: పారిస్ డిస్నీలాండ్ సమీపంలో పెద్దపులి... కొనసాగుతున్న పోలీసుల సెర్చింగ్
చిన్నారులకు ఎంతో ఇష్టమైన పారిస్ లోని డిస్నీలాండ్ సమీపానికి ఓ పెద్దపులి వచ్చింది. పారిస్ శివార్లలోని గడ్డి పొదల్లో తిష్ట వేసుకుని కూర్చున్న ఆ పెద్దపులి పోలీసులను, అటవీ శాఖ అధికారులను ముప్పుతిప్పలు పెడుతోంది. ఒక హెలీకాప్టర్ సహాయంతో 100 మందికి పైగా పోలీసు సిబ్బంది, ఫైర్ ఫైటర్ లు తీవ్రంగా కృషి చేసినా గురువారం రాత్రి వరకు పులిని పట్టుకోవడంలో విఫలమయ్యారు. కాగా, తిరిగి శుక్రవారం పొద్దున్నే (భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం ఒంటిగంటకు) పులి కోసం వేట ప్రారంభిస్తామని ఫ్రాన్స్ అటవీశాఖ అధికారి తెలిపారు. ఈ పులికి రెండేళ్ళ వయస్సు ఉండవచ్చని, కనీసం 70 కిలోల బరువు ఉంటుందని వివరించారు. పులిని పట్టేంత వరకు సమీపంలోని నివాసులు ఇళ్ల నుంచి బయటకు రావద్దని హెచ్చరించారు.