: మహిళల సత్ప్రవర్తనపై వ్యాఖ్యలు... ఈసారి బీహార్ సీఎం వంతు!
మహిళలు అలా ఉండాలి... కాదు ఇలా ఉండాలంటూ అనవసర వ్యాఖ్యలు చేస్తూ వివాదాల్లో చిక్కుకుంటున్న రాజకీయ నేతల సరసన బీహార్ ముఖ్యమంత్రి జితన్ రాం మాంఝీ చేరిపోయారు. ఇప్పటికే పలు వివాదాల్లో తడిసిముద్దైపోయిన మాంఝీ తాజాగా మహిళలపై తీవ్ర వ్యాఖ్యలు చేసి సొంత పార్టీ అధిష్ఠానం నుంచి చీవాట్లు తిన్నారు. "పెళ్లి తర్వాత భర్తలు నెలల తరబడి బయటే ఉంటే, వారి భార్యలు ఏం చేస్తుంటారన్న విషయం అందరికీ తెలుసు" అంటూ ఆయన వ్యాఖ్యానించారు. గోపాల్ గంజ్ జిల్లా జాజ్వా పక్డీ గ్రామంలో బుధవారం జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా మాంఝీ ఈ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. మాంఝీ వ్యాఖ్యలపై జేడీయూ తీవ్రంగానే స్పందించింది. "మాజీ ముఖ్యమంత్రి నితిశ్ కుమార్ రాష్ట్ర అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లేందుకే మాంఝీని ముఖ్యమంత్రిగా చేశారు. ఆయననేమీ భారత చరిత్రను తిరగరాయమని చెప్పలేదు. అది ఆయన పని కూడా కాదు. మాంఝీ వ్యాఖ్యలు పార్టీ ప్రతిష్ఠను మంటగలుపుతున్నాయి. తన అనుచిత వ్యాఖ్యలతో మాంఝీ హద్దులు దాటేస్తున్నారు. ఈ నేపథ్యంలో తన వైఖరి మార్చుకోకపోతే మాంఝీపై చర్యలు తీసుకునేందుకు కూడా వెనుకాడబోం" అని పార్టీ జాతీయ కార్యదర్శి కేసీ త్యాగి చెప్పారు.