: ఎస్ కే యూనివర్సిటీలో అవినీతి బాగోతం
అనంతపురం జిల్లాలోని శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో భారీ అవినీతి బాగోతం బయటబడింది. వర్శిటీలోని ఫైనాన్స్ విభాగం అధికారులు తమ చేతివాటం ప్రదర్శించి కోటి రూపాయలకు పైగా నిధులను దారి మళ్లించారు. యూనివర్శిటీలో అకౌంట్స్ విభాగంలో పనిచేస్తున్న ఉద్యోగులు ఉదయ భాస్కర్, శేషయ్యలు ఈ అవినీతికి పాల్పడ్డారని అధికారులు తేల్చారు. వీరిని యూనివర్శిటీ రిజిస్ట్రార్ ఆచార్య దశరథరామయ్య సస్పండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఘటనకు సంబంధించి విచారణ కోసం ముగ్గురు ప్రొఫెసర్లతో కూడిన త్రిసభ్య కమిటీని నియమించారు. 2006 నుంచి వర్సిటీలో విధులు నిర్వహించే ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లకు రావలసిన బకాయిల నుంచి ఆదాయపు పన్నును మినహాయించి, వారి జీతం నుంచి తగ్గించిన మొత్తాలను నేరుగా బినామీ ఖాతాలకు మళ్లించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. బోధనా సిబ్బంది ప్రొఫెషనల్ ట్యాక్స్, పీహెచ్‌డీ ఇంక్రిమెంట్ల చెల్లింపులను అక్రమంగా తమ ఖాతాలకు మళ్లించినట్లు తెలుస్తోంది. వర్సిటీలోని ఫైనాన్స్ అధికారులు అక్రమాలకు పాల్పడినట్లు ప్రాథమికంగా తేలిందని రిజిస్ట్రార్ దశరథరామయ్య ధ్రువీకరించారు.