: నిధుల పేరిట ఎంపీకి మోసగాడి టోకరా!


ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ కింద నిధులు మంజూరు చేయిస్తానని చెప్పి ఎంపీకి టోకరా ఇచ్చిన నయా ఘరానా మోసగాడి ఉదంతం గురువారం హైదరాబాదులో వెలుగు చూసింది. ఖమ్మం వైసీపీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డిని బుట్టలో పడేసిన సదరు మాయగాడు రూ. 1.5 లక్షలతో ఉడాయించాడు. అయితే సకాలంలో స్పందించిన ఎంపీ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సదరు ఘరానా మోసగాడి ఆట కట్టైంది. తూర్పు గోదావరి జిల్లా కిర్లంపూడికి చెందిన బాలాజీ నాయుడు కొంతకాలం పాటు ఎన్టీపీసీలో పనిచేసి మానేశాడు. ఉన్నతాధికారుల వద్ద తనను తాను ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ కమిషనర్ ప్రవీణ్ కుమార్ నంటూ బుకాయించాడు. ఎంపీ శ్రీనివాసరెడ్డికి ఫోన్ చేసిన నాయుడు, ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గానికి ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ కింద రూ.35 కోట్లు మంజూరు చేయిస్తానంటూ నమ్మబలికాడు. దీనిని గుడ్డిగా నమ్మిన శ్రీనివాసరెడ్డి సదరు పనిని తన పీఏ హరినాథ్ రెడ్డికి అప్పగించారు. ఒక్కో లబ్ధిదారుడి నుంచి రూ.300 చొప్పున వసూలు చేయాలన్న నాయుడు ఆదేశాలతో హరినాథ్ రెడ్డి రూ.1.50 లక్షలను అతడి ఖాతాలో వేసేశారు. ఎంతకీ నిధులు రాకపోగా, కమిషనర్ అవతారమెత్తిన నాయుడు కనిపించకపోవడంతో అనుమానం వచ్చిన శ్రీనివాసరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎంపీ ఫిర్యాదు నేపథ్యంలో రంగలోకి దిగిన బంజారాహిల్స్ పోలీసులు పక్కాగా వలపన్ని నాయుడితో పాటు అతడికి సహకరించిన ఓ మహిళను కూడా అదుపులోకి తీసుకున్నారు. అయితే నాయుడు ఒక్క శ్రీనివాసరెడ్డినే కాక ఇదే తరహాలో పెద్ద సంఖ్యలో రాజకీయ నేతలను బురిడీ కొట్టించినట్లు అతడిపై కేసులు నమోదయ్యాయి.

  • Loading...

More Telugu News