: కేంద్రానికి 17 వందల కోట్ల ప్రతిపాదనలు పంపాం: గంటా
రాష్ట్రీయ ఉచ్చతర్ శిక్షా అభియాన్ (రూసా) కింద కేంద్రానికి 17 వందల కోట్ల రూపాయల ప్రతిపాదనలు పంపినట్టు ఏపీ మానవ వనరుల శాఖ మంత్రి గంటా తెలిపారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, నాలుగు పీజీ కేంద్రాలు, ఆరు డిగ్రీ కళాశాలల స్థాయిని పెంచి విశ్వవిద్యాలయాలుగా మార్చే ప్రతిపాదనలు ఉన్నాయన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న 15 విశ్వవిద్యాలయాలకు ప్రత్యేక ఆర్థిక సాయం, ఏడు కళాశాలలకు మోడల్ డిగ్రీ కళాశాలల సాయం, మరో ఏడు డిగ్రీ కళాశాలలకు మోడల్ కళాశాలలుగా గుర్తింపునిచ్చి, సాయం వర్తింపచేయాలని కేంద్రాన్ని కోరుతున్నామని ఆయన చెప్పారు. 12 సాంకేతిక, వృత్తివిద్యా కళాశాలల ఏర్పాటు ప్రతిపాదనలు కూడా ఆయన పంపామన్నారు. 195 కళాశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు 390 కోట్లు, పరిశోధనలు పెంచేందుకు 120 కోట్లు అవసరమవుతాయని ప్రతిపాదనల్లో పేర్కొన్నట్టు ఆయన వెల్లడించారు. 590 అధ్యాపక సిబ్బంది నియామకాలకు 103 కోట్ల రూపాయలు అవసరమని ఆయన స్పష్టం చేశారు. ప్రతిపాదిత వ్యయంలో 65 శాతం కేంద్రం, 35 శాతం రాష్ట్రం భరించాల్సి ఉంటుందని ఆయన వివరించారు.