: ఫేస్ బుక్ లో వీడియో క్రియేషన్ ఆప్షన్ 'సే థ్యాంక్స్'
'సే థ్యాంక్స్' పేరిట ఓ సరికొత్త ఆప్షన్ ను విడుదల చేయడం ద్వారా 'వీడియో క్రియేషన్' టూల్ ను సోషల్ నెట్వర్కింగ్ సైట్ ఫేస్ బుక్ అందుబాటులోకి తెచ్చింది. దీంతో జీవితంలోని మధురానుభూతుల్ని, సంఘటనల్ని వీడియోల ద్వారా స్నేహితులు, బంధువులతో పంచుకునే వీలు వినియోగదారులకు కలుగుతుందని తెలిపింది. ఖాతాదారు పోస్ట్ చేసిన సందేశాల్ని, ఫొటోలను, కొత్త థీమ్స్ ను కలిపి వ్యక్తిగతంగా ఓ వీడియో రూపొందించుకోవడానికి 'సే థ్యాంక్స్' ఉపయోగపడుతుందని, మిత్రుల టైమ్ లైన్స్ పై వీడియోలను షేర్ చేసుకోవడానికి ప్రత్యేక ఏర్పాట్లను చేసామని ఫేస్ బుక్ తెలిపింది. వీడియో క్రియేట్ చేసుకోవడానికి ఫేస్ బుక్ లో www.facebook.com/thanks పేజికి వెళ్లి వీడియోను రూపొందించుకోవచ్చు. వ్యక్తులతో ఉన్న బంధాలు, సంబంధాలకు అనుగుణంగా ఫోటోలను ఎడిట్ చేసుకోవడానికి, వివిధ థీమ్స్ లలో వీడియోను రూపొందించుకోవడానికి కూడా ఫేస్ బుక్ అవకాశం కల్పించింది. వీడియోను రూపొందించిన తర్వాత పర్సనల్ మెసేజ్ ను కూడా పంపించుకోవడానికి అవకాశం ఉంది. కొత్త ఆప్షన్ ఇంగ్లీష్, ఫ్రాన్స్, జర్మన్, ఇండోనేషియా, ఇటలీ, పోర్చుగీస్, స్పానిష్, టర్కీ భాషల్లో డెస్క్ టాప్, మొబైల్ ద్వారా అందుబాటులో ఉంటుంది.