: ఎంపీ కవితపై ఆరోపణలకు ఆధారాలు: సీడీల రూపంలో స్పీకర్ కు రేవంత్ రెడ్డి
నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవితపై తాను చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉన్నట్లు టీడీపీ శాసన సభాపక్ష ఉప నేత రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. బుధవారం నాటి అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా చేసిన ప్రకటనకు అనుగుణంగా ఆయన తాను చేసిన ఆరోపణలకు సంబంధించిన ఆధారాలను సీడీ రూపంలో స్పీకర్ మధుసూదనాచారికి గురువారం అందజేశారు. సమగ్ర సర్వేలో భాగంగా కవిత రెండు చోట్ల తన పేరు నమోదు చేసుకున్నారని మంగళవారం రేవంత్ రెడ్డి ఆరోపించిన సంగతి తెలిసిందే. దీనిపై టీఆర్ఎస్ సభ్యులు బుధవారం రేవంత్ రెడ్డిపై మూకుమ్మడి దాడికి దిగారు. ఈ నేపథ్యంలో తన ఆరోపణలు అవాస్తవాలు కావని, వాటికి సంబంధించిన ఆధారాలను సభ ముందు పెడతానని ఆయన ప్రకటించిన సంగతి తెలిసిందే. తన ప్రకటనకు అనుగుణంగానే రేవంత్ రెడ్డి ఆధారాలతో కూడిన సీడీని స్పీకర్ కు అందజేశారు. అయితే అందులో ఏ తరహా ఆధారాలున్నాయన్న విషయం తెలియరాలేదు. ఈ సీడీపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.