: రక్షణ రంగ కొనుగోలు ఒప్పందాల్లో అవినీతి: రక్షణ శాఖ మంత్రి పారికర్
యూపీఏ హయాంలో రక్షణ రంగ కొనుగోలు ఒప్పందాల్లో అవినీతి చోటుచేసుకుందని రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్ చెప్పారు. ఈ కారణంగా ఒప్పందాల అమలులో తీవ్ర జాప్యం జరిగిందని కూడా ఆయన బుధవారం వ్యాఖ్యానించారు. అవినీతి మకిలిని కడిగిపారేయకపోతే సదరు ఒప్పందాల మేర ఆయుధ సంపత్తి భారత్ కు అందకుండాపోయే ప్రమాదం లేకపోలేదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. రక్షణ శాఖ మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా గోవా వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు. చైనా చొరబాట్లు అంత పెద్ద సమస్యేమీ కాదని ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు. భారత సైన్యానికి సదరు అతిక్రమణను సమర్థంగా తిప్పికొట్టగలిగే సామర్థ్యం ఉందన్నారు. అయితే ఇలాంటి దురాక్రమణలను తిప్పికొట్టేందుకు అవసరమైన మౌలిక సదుపాయాలను సైన్యానికి సమకూర్చాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.