: తూర్పు ఢిల్లీలో జంతు కళేబరం... రెండు వర్గాల మధ్య ఘర్షణ
అసలే మత ఘర్షణలు ఎక్కువగా జరిగే ప్రాంతం. నిత్యం పోలీసులు పహారా కాస్తుంటారు. అటువంటి ప్రాంతంలో గురువారం ఉదయం హిందువులు పవిత్రంగా భావించే జంతువు కళేబరం కనిపించింది. ఆ వెంటనే రెండు వర్గాలకు చెందిన ప్రజలు రెండు వైపులా చేరారు. ఓ రాజకీయ పార్టీ కార్యకర్తలు తోడయ్యారు. పరస్పర నినాదాలు చేసుకుని రాళ్ళు రువ్వుకున్నారు. తూర్పు ఢిల్లీ పరిధిలో ఇటీవల మత ఘర్షణలు చోటు చేసుకున్న త్రిలోకపురి సమీపంలో ఈ సంఘటన జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు పెద్దఎత్తున బలగాలతో ఘటన స్థలికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. కళ్యాణపురి పొలీస్ స్టేషన్ లో గుర్తు తెలియని వ్యక్తులపై కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. కాగా రెండు రోజుల క్రితం ఇక్కడికి సమీపంలోని భజన్ పురలో జంతువు తల కనిపించగా, అంతకు ముందు ఓక్లాలో కుడా అదే తరహా సంఘటన జరిగి ఉద్రిక్తతలకు దారితీసింది.