: మీరు కార్యదక్షులు: భారత ప్రధానికి ఒబామా ప్రశంస
భారత ప్రధాని నరేంద్ర మోదీపై అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా మరోమారు ప్రశంసల వర్షం కురిపించారు. ఆసియాన్ సదస్సుకు హాజరైన ప్రపంచ దేశాధినేతలకు మయన్మార్ అధ్యక్షుడు థీన్ సీన్ బుధవారం విందు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మోదీ, ఒబామాల మధ్య పరస్పర పలకరింపులు చోటుచేసుకున్నాయి. మోదీని పలుకరించిన ఒబామా ‘మీరు కార్యదక్షులు’ అంటూ కీర్తించారని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి సయ్యద్ అక్బరుద్దీన్ తెలిపారు. అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ లో జరిగిన విందులో భేటీ అయిన ఇరువురు నేతలు ఆరు వారాలు తిరగకముందే మరోమారు ఆసియాన్ సదస్సు సందర్భంగా కలిశారు. నాటి భేటీలో మోదీ పనితీరు, వ్యవహార సరళిపై ఒబామా ప్రశంసలు కురిపించిన సంగతి తెలిసిందే. భారత ప్రధాని పదవి చేపట్టిన నాటి నుంచి ఒబామా, మోదీపై ప్రత్యేక ఆసక్తి చూపిస్తున్నారు. దాదాపు మూడు దశాబ్ధాల తర్వాత భారత్ లో సంపూర్ణ మెజారిటీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన మోదీపై ఒబామా సహా ప్రపంచ దేశాల అధినేతలు ఆసక్తి కనబరుస్తున్న సంగతి తెలిసిందే.