: ఛత్తీస్ గఢ్ ‘ఆపరేషన్’ ఘటనపై ఎయిమ్స్ విచారణ!
ఛత్తీస్ గఢ్ లో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు వికటించి 11 మంది మహిళలు మృతి చెందిన ఘటనపై అఖిల భారత వైద్య, విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్) విచారణ చేపట్టనుంది. ఈ ఘటనపై సుమోటోగా విచారణ చేపట్టాలన్న అభ్యర్థనను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ, ఛత్తీస్ గఢ్ ముఖ్యమంత్రి రమణ్ సింగ్ లు పర్యవేక్షణ జరుపుతున్న నేపథ్యంలో తాము విచారణ చేపట్టలేమని కోర్టు తెలిపింది. దీంతో ఛత్తీస్ గఢ్ సీఎం రమణ్ సింగ్ ఎయిమ్స్ దర్యాప్తునకు ఆదేశాలు జారీ చేశారు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగా చోటుచేసుకున్న ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ, రమణ్ సింగ్ తో మాట్లాడారు. వైద్యులకు సాధ్యం కాని లక్ష్యాలను నిర్దేశిస్తున్న క్రమంలోనే ఈ తరహా ఘటనలు చోటుచేసుకుంటున్నాయని ఈ సందర్భంగా మోదీ అసహనం వ్యక్తం చేశారు. బిలాస్ పూర్ లోని నేమీ చంద్ ప్రభుత్వ వైద్యశాల వైద్యులు కేవలం 5 గంటల వ్యవధిలోనే మొత్తం 83 మంది మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు నిర్వహించారు. ఆపరేషన్ తర్వాత ‘సెప్టిక్ షాక్’ కారణంగానే బాధితులు మృత్యువాత పడ్డట్లు ప్రాథమిక విచారణలో తేలింది.