: ఫాం హౌస్ లో మందు తాగేటోళ్లకి పాల గురించి ఏం తెలుసు: రేవంత్ రెడ్డి


తెలంగాణ సర్కారుపై టీడీపీ సభ్యుడు రేవంత్ రెడ్డి మరోమారు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘ఫాం హౌస్ లో మందు తాగేవారికి పాల గురించి ఏం తెలుసు’ అంటూ ఆయన వ్యాఖ్యానించారు. బుధవారం అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా కల్తీ పాలపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు కుటుంబం ఆధ్వర్యంలోని హెరిటేజ్ పాలలోనూ కల్తీ జరుగుతోందని, ఆ కారణంగానే కేరళ ప్రభుత్వం హెరిటేజ్ పాలను నిషేధించిందని టీఆర్ఎస్ ఆరోపించింది. దీంతో టీడీపీ సభ్యులు సభలో ఆందోళనకు దిగారు. సభలో గందరగోళం నేపథ్యంలో సభను స్పీకర్ పది నిమిషాల పాటు వాయిదా వేశారు. సభ వాయిదా పడగానే బయటకు వచ్చిన రేవంత్ రెడ్డి మీడియా పాయింట్ వద్ద విలేకరులతో మాట్లాడారు. ఫాం హౌస్ లో కూర్చుని చల్లగా మందు కొట్టేవారికి పాల గురించి ఏం తెలుసు? అని వ్యాఖ్యానించారు. రైతుల నుంచి పాలను సేకరించే హెరిటేజ్, వాటిని ప్యాకింగ్ మాత్రమే చేస్తుందని తెలిపారు. అయినా ఆక్సిటోసిన్ ను పశువులకు వేస్తారు తప్పించి, పాలకు వేయరన్న విషయం తెరాస సభ్యులకు తెలియదని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

  • Loading...

More Telugu News