: నేడే ‘మహా’ సీఎం ఫడ్నవీస్ విశ్వాస పరీక్ష!


మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వం నేడు అసెంబ్లీలో విశ్వాస పరీక్షను ఎదుర్కోనుంది. నేటి ఉదయం ప్రారంభం కానున్న సభలో 11 గంటలకు తొలుత స్పీకర్ ఎన్నికపై ఓటింగ్ జరుగుతుంది. అనంతరం 1-2 గంటలకు ఫడ్నవీస్ సర్కారుపై విశ్వాస పరీక్షకు సంబంధించిన ఓటింగ్ జరగనుంది. ఆ తర్వాత సభలో గవర్నర్ ప్రసంగం ఉంటుంది. ఇదిలా ఉంటే విశ్వాస పరీక్షలో ఫడ్నవీస్ ప్రభుత్వం గట్టెక్కడం ఖాయంగానే కనిపిస్తోంది. ఇప్పటికే 122 మంది సభ్యుల బలంతో ఉన్న బీజేపీకి, పూర్తి స్థాయి మెజారిటీ కోసం ఇంకో 23 మంది సభ్యుల మద్దతు అవసరం. 63 స్థానాల్లో విజయం సాధించి సభలో అతిపెద్ద రెండో పార్టీగా అవతరించిన శివసేన, మద్దతు విషయంలో దోబూచులాడుతోంది. మరోవైపు బయటి నుంచే బీజేపీ సర్కారుకు మద్దతిచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు 41 మంది సభ్యుల బలం ఉన్న ఎన్సీపీ ప్రకటించింది. మహారాష్ట్ర అభివృద్ధి కోసం కాంగ్రెస్ మినహా ఏ పార్టీ మద్దతు తీసుకునేందుకైనా సిద్ధంగా ఉన్నట్లు బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి రాజీవ్ ప్రతాప్ రూడీ మంగళవారం ప్రకటించారు. ఈ నేపథ్యంలో శివసేన కలసిరాని పక్షంలో ఎన్సీపీ మద్దతుతోనైనా విశ్వాస పరీక్షలో నెగ్గేందుకు బీజేపీ యత్నించనుందన్న పరోక్ష సంకేతాలను ఆయన ఇచ్చారు. ఇదిలా వుంటే, ఫడ్నవీస్ సర్కారుకు మద్దతు విషయంలో శివసేన నేటి ఉదయం నిర్ణయం తీసుకోనుంది.

  • Loading...

More Telugu News