: ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీకి విజయం నల్లేరుపై నడకే!
దేశ వ్యాప్తంగా పాగా వేస్తున్న భారతీయ జనతా పార్టీ, ఎన్నికలకు సిద్ధమవుతున్న ఢిల్లీ రాష్ట్రంలోనూ ఈజీగా విజయం సాధిస్తుందని 'ఒపీనియన్ పోల్స్' చెబుతున్నాయి. ఈ మేరకు 'ఏబీపీ న్యూస్-నీల్సన్' జరిపిన సర్వే ఈ విషయాన్ని తెలిపింది. నరేంద్ర మోదీ పాప్యులారిటీతో అతిపెద్ద పార్టీగా బీజేపీ అవతరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పుడు కనుక ఢిల్లీలో ఎన్నికలు నిర్వహిస్తే, 70 సీట్లకుగానూ కమలం 46 సీట్లు దక్కించుకుంటుందని సర్వే వెల్లడించింది. ఆమ్ ఆద్మీ పార్టీ 18, కాంగ్రెస్ ఐదు స్థానాలకు పరిమితమవుతాయని సర్వే వివరించింది. అంటే బీజేపీ 38%, ఏఏపీ 26%, కాంగ్రెస్ 22% ఓట్లను పంచుకుంటాయని పేర్కొంది. ఇదే సమయంలో ఆప్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాలే ఢిల్లీ సీఎం పదవికి తగిన వ్యక్తని 39% ప్రజలు మొగ్గు చూపుతున్నారు. అదే సమయంలో బీజేపీ నేత హర్షవర్ధన్ కూడా ఆ పదవికి ముఖ్యమైన వ్యక్తని 38% మంది చెబుతున్నారట. అటు కాంగ్రెస్ మాజీ సీఎం షీలా దీక్షిత్ కు 7% మంది ఓకే చెప్పారు. ఈ సర్వేలో పాల్గొన్న వారిలో 61 శాతం మంది సీఎంగా ఉన్న 49 రోజుల్లో కేజ్రీవాల్ పనితీరు పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు!