: వన్డే వరల్డ్ కప్ ప్రైజ్ మనీ పెంపు
వచ్చే ఏడాది ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న వన్డే వరల్డ్ కప్ ప్రైజ్ మనీ పెంచినట్టు ఐసీసీ ఓ ప్రకటనలో తెలిపింది. టోర్నీ విజేతకు రూ.23 కోట్లు, రన్నరప్ కు రూ.10 కోట్లు ఇస్తారు. సెమీఫైనల్ పరాజితులకు రూ.3.6 కోట్ల చొప్పున ఇస్తారు. క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ లలో ఓటమిపాలైన జట్లు రూ.1.8 కోట్ల చొప్పున అందుకుంటాయి. ఇక, గ్రూప్ దశలో మ్యాచ్ విజేతల ఫీజు, గ్రూప్ దశలో ఓటమిపాలైన జట్ల ఫీజు, ఇతర నజరానాలతో కలిపి టోర్నీకి మొత్తం రూ.61 కోట్ల ప్రైజ్ మనీ ప్రకటించారు. 2011 వరల్డ్ కప్ టోర్నీ మొత్తం ప్రైజ్ మనీ రూ.49 కోట్లు. ఆ ఈవెంట్లో నెగ్గిన భారత జట్టు రూ.19 కోట్ల ప్రైజ్ మనీ అందుకుంది. రన్నరప్ శ్రీలంకకు రూ.9.2 కోట్ల నగదు బహుమతి దక్కింది. మొత్తమ్మీద తాజా ఈవెంట్ కు సుమారు 20 శాతం ప్రైజ్ మనీ పెంచినట్టు తెలుస్తోంది. కాగా, టోర్నీలో జరిగే 49 మ్యాచ్ లలోనూ డెసిషన్ రివ్యూ సిస్టమ్ (డీఆర్ఎస్) అమలు చేయనున్నట్టు ఐసీసీ తన ప్రకటనలో తెలిపింది.