: మోదీ కేబినెట్లో బాలీవుడ్ నేపథ్య గాయకుడు!
కేంద్ర కేబినెట్ ను ఆదివారం నాడు విస్తరించిన సంగతి తెలిసిందే. విస్తరణలో భాగంగా మంత్రి పదవి దక్కించుకున్న వారిలో బాబుల్ సుప్రియో ఒకడు. మోదీ మంత్రివర్గంలో ఈయనే అత్యంత పిన్న వయస్కుడు. వయసు 43 సంవత్సరాలు. పట్టణాభివృద్ధి, గృహ నిర్మాణ మంత్రిత్వ శాఖ సహాయమంత్రిగా నియమితుడయ్యారు. బాబుల్ సుప్రియో నేపథ్యంలోకి వెళితే... పశ్చిమ బెంగాల్లోని హుగ్లీ జిల్లాలోని ఉత్తర్ పారా పట్టణంలో ఆయన జన్మించారు. బాబుల్ తాత బణికంఠ బరాల్ సుప్రసిద్ధ సంగీత విద్వాంసుడు. తాత వద్ద సంగీతంలో ఓనమాలు దిద్దుకుని, పలు వేదికలపై తన గానమాధుర్యంతో ఎన్నో బహుమతులు అందుకున్నారు. బాల్యం నుంచే ఆలిండియా రేడియో, దూరదర్శన్ లో ప్రదర్శనలు ఇచ్చిన బాబుల్ 1992లో కోల్ కతా నుంచి ముంబయికి మకాం మార్చాడు. బాలీవుడ్ లో ఎన్నో సినిమాల్లో పాటలు పాడి ప్రతిభావంతుడిగా పేరు తెచ్చుకున్నాడు. అనంతరం పలు బెంగాలీ చిత్రాల్లోనూ ప్రధాన పాత్రలు పోషించాడు. అనంతరం బీజేపీలో చేరడం ద్వారా రాజకీయాల్లోకి ప్రవేశించాడు. తాజా ఎన్నికల్లో, బీజేపీకి పెద్దగా ఆశల్లేని అసన్ సోల్ లోక్ సభ స్థానం నుంచి బరిలోకి దిగిన బాబుల్ తృణమూల్ అభ్యర్థి డోలా సేన్ పై 70 వేల ఓట్ల తేడాతో నెగ్గడం విశేషం. ఇప్పుడు, ప్రధాని మోదీ నమ్మకాన్ని చూరగొనడం ద్వారా ఏకంగా మంత్రి పదవినే దక్కించుకున్నాడు.