: షిండే కూతురుకు మజ్లిస్ లీగల్ నోటీసు
కేంద్ర మాజీ మంత్రి సుశీల్ కుమార్ షిండే కూతురు, షోలాపూర్ సెంట్రల్ ఎమ్మెల్యే ప్రణతి షిండేకు మజ్లిస్ పార్టీ లీగల్ నోటీసులు జారీ చేసింది. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ దేశంలో విచ్ఛిన్న శక్తిగా పరిణమిస్తున్న మజ్లిస్ పార్టీపై నిషేధం విధించాలని ప్రణతి ఇటీవల వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఆమె వ్యాఖ్యలను మజ్లిస్ అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ సీరియస్ గా తీసుకున్నారు. తమ పార్టీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ప్రణతి బేషరతుగా క్షమాపణలు చెప్పడంతో పాటు తన వ్యాఖ్యలను వెనక్కు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. అయితే, ఒవైసీ డిమాండ్ ను ఆమె పెద్దగా పట్టించుకోలేదు. దీంతో మజ్లిస్ పార్టీ ఆమెకు లీగల్ నోటీసు జారీ చేసింది. ఎనిమిది రోజుల్లోగా తన వ్యాఖ్యలను వాపస్ తీసుకోవాలని ఆ నోటీసుల్లో మజ్లిస్ సూచించింది. లేని పక్షంలో కోర్టును ఆశ్రయించాల్సి వస్తుందని కూడా మజ్లిస్ పార్టీ ప్రణతికి హెచ్చరికలు జారీ చేసింది.