: ధైర్యంగా ఉండండి: బోడో కిడ్నాప్ బాధిత కుటుంబానికి వైఎస్ జగన్
బోడో తీవ్రవాదులు అపహరించిన తెలుగు కాంట్రాక్టర్ మహేశ్వరరెడ్డి కుటుంబానికి వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోమవారం ఫోన్ చేశారు. ఎలాంటి భయాందోళనలకు గురి కావద్దని ఈ సందర్భంగా ఆ కుటుంబ సభ్యులకు జగన్ ధైర్యం చెప్పారు. మహేశ్వరరెడ్డిని విడిపించేందుకు కృషి చేస్తున్నామని, త్వరలోనే ఆయనను బోడోల కబంధ హస్తాల నుంచి విడిపించేలా చేస్తామని తెలిపారు. ఈ విషయంలో కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ తో చర్చిస్తున్నామని ఆయన వెల్లడించారు. కడప జిల్లా రామాపురం మండలం హసనాపురానికి చెందిన మహేశ్వరరెడ్డి క్లాస్-1 కాంట్రాక్టర్ గా కొనసాగుతున్నారు. మూడేళ్ల కిందట హైదరాబాద్ కు నివాసాన్ని మార్చిన మహేశ్వరరెడ్డి రాంకీ చేజిక్కించుకున్న జాతీయ రహదారి పనిని సబ్ కాంట్రాక్టు కింద దక్కించుకున్నాడు. సదరు కాంట్రాక్టు పనిలో ఉండగానే బోడో తీవ్రవాదులు ఆయనను అపహరించారు. రూ.2 కోట్లిస్తేనే మహేశ్వరరెడ్డిని విడుదల చేస్తామని బోడో తీవ్రవాదులు డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే.