: విరాట్ ముందు వివియన్ రిచర్డ్స్ దిగదుడుపే!
టీమిండియా తాత్కాలిక కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆదివారం నాటి ఉప్పల్ వన్డేలో తన ప్రేయసి అనుష్క శర్మకు బ్యాట్ ద్వారా మైదానం నుంచే ఫ్లైయింగ్ కిస్సులిచ్చిన సంగతి గుర్తుందిగా. కోహ్లీకి సెంచరీలే లెక్కలేదు, అర్ధ సెంచరీలు ఓ లెక్కా? మరి తన స్కోరు 53 పరుగులు దాటగానే కోహ్లీ, అంతగా ఉప్పొంగిపోయాడు ఎందుకని? అందుకు ఓ కారణముంది. విండీస్ క్రికెట్ దిగ్గజం వివియన్ రిచర్డ్స్ వేగంగా ఆరు వేల పరుగులు సాధించిన క్రికెటర్ గా సుదీర్ఘకాలం పాటు కొనసాగుతున్నాడు. అయితే నిన్నటి మ్యాచ్ లో కోహ్లీ సదరు రికార్డును బద్దలు కొట్టాడు. 156 మ్యాచ్ లు ఆడిన వివియన్ రిచర్డ్స్ 141 ఇన్నింగ్స్ లో ఈ ఫీట్ ను సాధించగా, కోహ్లీ 146 మ్యాచ్ లు ఆడి కేవలం 136 ఇన్నింగ్స్ లోనే ఆరు వేల పరుగుల మార్కును అధిగమించాడు. వివియన్ రిచర్డ్స్ పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టడమంటే మాటలు కాదుగా. అందుకే పట్టరాని సంతోషంతో ఉప్పొంగిపోయిన కోహ్లీ ఫ్లైయింగ్ కిస్సుల రూపంలో తన ఆనందాన్ని అనుష్కతో పంచుకున్నాడు.